బీజేపీ ‘ప్యూన్‌’ విమర్శలు.. కిశోరి లాల్‌ శర్మ కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

బీజేపీ ‘ప్యూన్‌’ విమర్శలు.. కిశోరి లాల్‌ శర్మ కౌంటర్‌

Published Sun, May 5 2024 5:10 PM

KL Sharma im Not Gandhi family servant seasoned politician bjp peon remark

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కీలకమైన ఆమేథీ పార్లమెంట్‌ స్థానంలో సస్పెన్స్‌కు తెరదించుతూ గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్‌ శర్మను బరిలోకి దించింది. ఆయన ఎంపికపై బీజేపీ.. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించింది. 

ఆమేథీలో కాంగ్రెస్‌ పార్టీ ఒక ‘ప్యూన్‌’ను పోటీకి దింపిందని ఎద్దేవా చేసింది. అయితే బీజేపీ విమర్శలకు ఆమేథీ కాంగ్రెస్‌ అభ్యర్థి కిషోరి లాల్‌ శర్మ కౌంటర్ ఇచ్చారు. తాను గాంధీ కుటుంబానికి ‘సర్వెంట్‌’ను కాదు.. చాలా అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని అని బీజేనీ విమర్శలను తిప్పికొట్టారు.

‘ఆమేథి నియోజకవర్గంలో నా ఎంపిక నిర్ణయాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్‌ తీసుకుంది. నాకు టికెట్‌ ఇచ్చేవరకు ఇక్కడి అభ్యర్థి ఎవరనేది ఖరారు చేయలేదు. టికెట్‌ రాకముందే నేను సిట్టింగ్‌ ఎంపీ స్మృతి ఇరానీని ఓడిస్తానని ఎలా విశ్వాసం వ్యక్తం చేస్తాను.  ఇక్కడ పోటీ చేస్తున్న నేను గాంధీ కుటుంబానికి సర్వెంట్‌ను కాదు.. నేను చాలా ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని. నాకు ఇక్కడ కాంగ్రెస్‌తో 1983 నుంచి అనుబంధం ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో నేను వేతనం తీసుకునే ఉద్యోగి కాదు.. నేను ఒక స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిని’ అని కిషోరి లాల్ శర్మ అన్నారు.

ఆమేథీలో మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అప్పుడు కేరళలోని వాయ్‌నాడ్‌ సెగ్మెంట్‌ గెలిచారు రాహుల్‌ గాంధీ. అదే విధంగా ఈసారి​ కూడా రాహుల్‌ గాంధీ వాయ్‌నాడ్‌ బరిలో దిగగా.. అక్కడ పోలింగ్‌ పూర్తైంది. ఇక.. కాంగ్రెస్‌ పార్టీకి కీలమైన ఆమేథీ, రాయ్‌బరేలీలో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించింది. ఆమేథీలో కిషోరి లాల్‌ శర్మ, రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీని బరిలోకి దించిన విషయం తెలిసిందే. ఇక.. ఈ రెండు స్థానాలో మే 20న పోలింగ్‌ జరగనుంది.

Advertisement
Advertisement