సన్న వడ్లకే బోనస్సా? | Sakshi
Sakshi News home page

సన్న వడ్లకే బోనస్సా?

Published Thu, May 16 2024 4:28 AM

KCR fire on CM Revanth

ఇది రైతాంగాన్ని మరోసారి మోసం చేయడమే

సీఎం రేవంత్‌పై కేసీఆర్‌ ఫైర్‌

ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. రైతాంగాన్ని ప్రభుత్వం మరోసారి మోసం చేస్తోందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేసీఆర్‌ మండిపడ్డారు. ‘పార్లమెంటు ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లిస్తానని ప్రకటించిన సీఎం ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే వర్తింప చేస్తామనడం రైతాంగాన్ని మరోసారి వంచించి మోసం చేయడం, దగా చేయడమే..’ అని దుయ్యబట్టారు. 

ఎన్నికలకు ముందైతే తుక్కుతుక్కు చేసేవాళ్లు
‘రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారనే విషయం తెలిసీ సన్న వడ్లకు మాత్రమే బోనస్‌ ఇస్తామనడం వంచించడమే. ఓట్లు డబ్బాలో పడగానే కాంగ్రెస్‌కు రైతుల అవసరం తీరింది. సన్న వడ్లకు మాత్రమే బోనస్‌ అని ఎన్నికలకు ముందు ప్రకటించి ఉంటే కాంగ్రెస్‌ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవాళ్లు. రైతాంగ హక్కులను కాపాడేందుకు, ప్రభుత్వ హామీలను సాధించేందుకే బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతోంది..’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

 బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడంపై కూడా నిర్లక్ష్యం వహిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని మాజీ సీఎం విమర్శించారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు, కల్లాల సందర్శన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement