గత పీపీఏలపై నివేదిక ఇవ్వండి | Sakshi
Sakshi News home page

గత పీపీఏలపై నివేదిక ఇవ్వండి

Published Thu, Jan 11 2024 12:29 AM

Revanth Reddy order to officials in review of electricity department - Sakshi

రాష్ట్రానికి సమగ్ర విద్యుత్‌ విధానం లేక ఎన్నో రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల విద్యుత్‌ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో అన్ని రాజకీయ పక్షాలతో విస్తృతంగా చర్చించిన తర్వాత కొత్తగా సమగ్ర విద్యుత్‌ విధానాన్ని రూపొందిస్తామని ప్రకటించారు. ఇందుకోసం విద్యుత్‌ రంగ నిపుణులతో సైతం విస్తృతంగా సంప్రదింపులు నిర్వహిస్తామన్నారు. ఇతర అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన విద్యుత్‌ విధానానికి రూపకల్పన చేస్తామన్నారు.  

సాక్షి, హైదరాబాద్‌:  గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు విద్యుదుత్పత్తి కంపెనీలతో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు కుదుర్చుకున్న అన్నిరకాల పీపీఏలపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇతర అంశాలతో పాటు పీపీఏలకు సంబంధించిన నిబంధనలు, రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నుంచి పొందిన అనుమతులు, విద్యుత్‌ కొనుగోలు ధరలు నివేదికలో ఉండాలని అన్నారు.

అధిక ధరతో విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు జరిగిన ఒప్పందాలకు కారణాలను కూడా వివరించాలని కోరారు. ఇకపై బహిరంగ మార్కెట్లో ఎవరు తక్కువ ధరకు విద్యుత్‌ విక్రయిస్తున్నారో వారి వద్ద నుంచే విద్యుత్‌ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యుత్‌ శాఖపై బుధవారం సచివాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, డి.శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా, భవిష్యత్తులో పెరిగే రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను తీర్చడానికి వీలుగా కొత్త విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) ఉత్పత్తి సామర్థ్యం పెంపుదల, ఎన్నికల హామీ మేరకు గృహజ్యోతి పథకం కింద గృహ వినియోగదారులకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. జెన్‌కో ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యుదుత్పత్తి, ఇతర విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి చేస్తున్న విద్యుత్‌ కొనుగోళ్లు, రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్, సరఫరా పరిస్థితులు, డిస్కంల ఆర్థిక పరిస్థితి, పనితీరుపై ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు. 

24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వాల్సిందే 
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చి తీరాలని సీఎం స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలలో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ కొత్త విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, నిర్మాణంలో ఉన్న విద్యుత్‌ కేంద్రాలను సత్వరం పూర్తి చేయాలని చెప్పారు. విద్యుత్‌ దురి్వనియోగాన్ని అరికట్టాలని, నాణ్యతను పెంచాలని సూచించారు.

విద్యుత్‌ నిరంతర సరఫరాలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందస్తుగా పటిష్ట చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎస్‌ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి/ జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల ఇన్‌చార్జి సీఎండీ సయ్యద్‌ ముర్తుజా అలీ రిజ్వీ, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషార్రఫ్‌ ఫారూఖీ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి కూడా సమీక్షలో పాల్గొన్నారు. 

వికారాబాద్‌లో నేవీ రాడార్‌ స్టేషన్‌: సీఎం 
ఫిబ్రవరిలో పనులు ప్రారంభం 

సాక్షి, హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లా పరిగి నియోజకవర్గంలోని అటవీ ప్రాంతంలో ఇండియన్‌ నేవీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీక్వెన్సీ రాడార్‌ స్టేషన్‌ పనులు వచ్చే ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దామగుండం దేవాలయానికి, పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఈ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తారని చెప్పారు. అదే స్థలంలో ఆలయాభివృద్ధి పనులు కూడాచేపడ్తారన్నారు.

ఇండియన్‌ నేవీ కమాండర్‌ కార్తిక్‌ శంకర్‌ నేతృత్వంలోని బృందం బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసింది. రాడార్‌ స్టేషన్‌ నిర్మాణం విశేషాలను వివరించింది. నేవీకి సంబంధించిన భారీ పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేస్తారని, దీంతో పరిగి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపింది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. కాగా పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌ రెడ్డిని సమన్వయం చేసుకుని త్వరలో పనులు ప్రారంభించాలని నేవీ అధికారులకు సీఎం సూచించారు. కల్నల్‌ హిమవంత్‌ రెడ్డి, నేవీ సిబ్బంది సందీప్‌ దాస్, రాజ్‌బీర్‌ సింగ్, మణిశర్మ, మనోజ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement