తెలంగాణలో రాహుల్‌, కాంగ్రెస్‌కు ఇచ్చిపడేసిన అమిత్‌ షా | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రాహుల్‌, కాంగ్రెస్‌కు ఇచ్చిపడేసిన అమిత్‌ షా

Published Sat, May 11 2024 12:51 PM

Amit Shah Political Counter To Congress And Rahul Gandhi

సాక్షి, వికారాబాద్‌: కాంగ్రెస్‌కు సర్జికల్‌ దాడులు చేసే ధైర్యం లేదన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. అలాగే, బీజేపీకి ఓటేస్తే.. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. ఇక, తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటే. మజ్లిస్‌ ఓటు బ్యాంకుకు రేవంత్‌ రెడ్డి భయపడుతున్నాడుని సంచలన ఆరోపణలు చేశారు.

కాగా, అమిత్‌ షా శనివారం వికారాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ బహిరంగ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ..‘పాకిస్తాన్‌ దగ్గర ఆటమ్‌ బాంబ్‌ ఉందని కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ భయపడుతున్నారు. బాంబ్‌ ఉందని పీవోకేని పాకిస్తాన్‌కు అప్పగిస్తామా?. బీజేపీ ఉన్నంత కాలం పీవోకేను పాకిస్తాన్‌కు అప్పగించడం ఎవరికీ సాధ్యం కాదు. కశ్మీర్‌ మనదేనా కాదా?.. తెలంగాణ ప్రజలు స్పష్టంగా చెప్పాలి. సర్జికల్‌ దాడులు చేసి పాకిస్తాన్‌లో దాక్కున్న ఉగ్రవాదులను మట్టుబెట్టాం. సర్జికల్‌ దాడులు చేసే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు.

రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్‌ అడ్డుపడింది. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాహుల్‌, ఖర్గే, ప్రియాంక ఎందుకు రాలేదు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వెళ్తే.. తమ ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బతింటుందో అని కాంగ్రెస్‌ నేతలు భయపడ్డారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే ప్రధాని కావాలా?.. వాళ్లను రక్షించే వాళ్లు కావాలా?. నరేంద్ర మోదీపై ఒక్క అవినీతి మరక కూడా లేదు. కొం​చెం వేడి ఎక్కువైతే ఫారిన్‌ టూర్లకు వెళ్లే రాహుల్‌ ఒకవైపు.. దీపావళి రోజు కూడా సెలవు తీసుకోని వ్యక్తి మోదీ మరోవైపు. మోదీ, రాహుల్‌లలో ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి.

బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని రేవంత్‌ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటే. బీజేపీకి ఓటేస్తే ముస్లిం రిజర్వేష్లను తొలగిస్తాం. కాళేశ్వరం అవినీతికి అడ్డాగా మారింది. 
ఏ అంటే అసదుద్దీన్‌, బీ అంటే బీఆర్‌ఎస్‌, సీ అంటే కాంగ్రెస్‌. సర్జికల్‌ దాడుల గురించి రేవంత్‌ రెడ్డి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. కశ్మీర్‌ మనదేనా కాదా?.. తెలంగాణ ప్రజలు స్పష్టంగా చెప్పాలి. మజ్లిస్‌ ఓటు బ్యాంకుకు రేవంత్‌ రెడ్డి భయపడుతున్నాడు. బుల్లెట్‌ ట్రైన్‌ తొలి స్టాప్‌ వికరాబాద్‌లో రాబోతోంది. హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని జరపాలా?. వద్దా?. తెలంగాణలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. తెలంగాణలు డబ్బులు ఢిల్లీకి చేరుతున్నాయి’ అని వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement