కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్‌రెడ్డి

Published Mon, May 6 2024 5:31 AM

ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ రోడ్‌ షోలో పార్టీ శ్రేణులు  బహూకరించిన గదతో సీఎం రేవంత్‌రెడ్డి

గుజరాత్‌కు..తెలంగాణకు మధ్య పోటీ

కేసులు పెట్టి భయపెడతారో? విధానాలతో కొట్లాడతారో మోదీ, షానే తేల్చుకోవాలి 

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘మోసానికి, విశ్వసనీయతకు మధ్య పోటీ..ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య పోటీ’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి తరపున ఆదివారం రాత్రి తుక్కుగూడ, శంషాబాద్‌లో రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... ఈనెల 13న గుజరాత్‌ వర్సెస్‌ తెలంగాణ మధ్య పోటీ జరుగుతోంది. 

తెలంగాణకు చాంపియన్‌షిప్‌ తెచ్చే బాధ్యత కాంగ్రెస్‌ కార్యకర్తలదే. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. కందుకూరులో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తాం. ఎన్నికల తర్వాత స్వయంగా వచ్చి కొబ్బరికాయ కొడతా. ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా రావాలన్నా.. కందుకూరు వరకు మెట్రో రావాలన్నా..వికారాబాద్‌లో పుట్టి నేరేడుచర్లలో ముగిసే మూసీ సుందరీకరణ జరగాలన్నా..కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలి. 

రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తినందుకే నాపై కేసులు 
గత సెపె్టంబర్‌ 17న ఇదే తుక్కుగూడ వేదిక నుంచి ఆరు గ్యారంటీల హామీ ఇచ్చాం. 65 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించారు. అదే స్ఫూర్తితో మళ్లీ ఇదే తుక్కుగూడ నుంచి దేశంలో గెలుపునకు ఐదు గ్యారంటీల మేనిఫెస్టో విడుదల చేశాం. ఆ రోజు నుంచి మోదీ, అమిత్‌షాకు నిద్రపట్టడం లేదు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తినందుకు నాపై కేసులు పెట్టారు. ఢిల్లీ నుంచి పోలీసులను పంపాడు. అరెస్ట్‌ చేస్తామని అమిత్‌షా చెప్పుతుండు. విధానాలతో కొట్లాడతారో? కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడతారో? బీజేపీ నేతలే తేల్చుకోవాలి. నాకు కేసులు కొత్తకాదు.  

రాముడిని మోసం చేశారు 
ఎవరైనా పెళ్లయిన తర్వాత అక్షింతలు చేతికిస్తారు. కానీ బీజేపీ నేతలు రాముడి విగ్రహ ప్రతిష్ఠకు ముందే అక్షింతలు పంపారు. రేషన్‌బియ్యం తెచ్చి, స్థానికంగా పసుపు కలిపి, అయోధ్య అక్షింతలని చెప్పి రాముడిని మోసం చేశారు. దేవుడిని అడ్డం పెట్టుకొని తెలంగాణలో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారు. అవి నిజంగా అక్షింతలేనా? భద్రాచలం రాముడిపై ఒట్టేసి చెప్పగలరా? దేవుడంటే మీకు ఓట్లు కావొచ్చు, కానీ మేము హనుమంతునిలా విశ్వసిస్తాం. దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్న వారంతా నకిలీ హిందువులే. 

పొలిమేర్ల దాకా తరిమికొట్టాలి 
తెలంగాణ తల్లిని అడ్డుపెట్టుకొని ఒకరు..దేవుడిని అడ్డం పెట్టుకొని మరొకరు ఓట్లు అడుగుతున్నారు. తెలంగాణ తల్లి సెంటిమెంట్‌ను బీఆర్‌ఎస్‌ అడ్డుపెట్టుకొని వందల ఎకరాల్లో ఫాంహౌస్‌లు, వేలకోట్లు కొల్లగొట్టారు. అదే మోదీ దేవుడి పేరుతో దేశాన్ని కొల్లగొట్టేందుకు కుట్రపన్నారు. వీరు నకిలీ హిందువులు. పదేళ్లలో ఆయన చేసిందేమీ లేదు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఆయనకు లేదు. పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేసిన మోదీని, ఆయన పార్టీని పొలిమేర్ల దాకా తరిమికొట్టాలి.  

చీరకట్టుకొని చింతమడకకెళ్లు 
కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలపై కేటీఆర్‌ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. గ్యారంటీలు అమలు చేయడం లేదంటూ కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పథకాలు ఆయన కళ్లకు కనిపించడం లేదు. కేటీఆర్‌ నీవు ఒకసారి చీరకట్టుకొని బసెక్కి..చింతమడక, సిరిసిల్ల వరకు వెళ్లిరా. బస్సులో టికెట్‌ అడిగితే మా ఆరు గ్యారంటీలు అమలు చేయనట్లే.  

సబితమ్మా నీకు ఇది న్యాయమా? 
సబితక్క..బీఆర్‌ఎస్‌లో ఉంది. బీజేపీకి ఓటు వేయాలని చెబుతోంది. నమ్మిన పార్టీని, నమ్మిన నాయకున్ని, నమ్ముకున్న కార్యకర్తను నట్టేట ముంచుతున్నావు. సబితమ్మా నీకు ఇది న్యాయమా? నీ పార్టీ కోసం కొట్లాడు. కానీ బీజేపీ గెలుపు కోసం ఎలా పని చేస్తావు? ఆనాడు నువ్వు కాంగ్రెస్‌ నుంచి గెలిచినా కేసీఆర్‌ నీకు మంత్రి పదవి ఇచ్చారు. ఈనాడు ఆయన్ను కూడా మోసం చేయడం కరెక్టేనా’అని రేవంత్‌ ప్రశిం్నంచారు.   

Advertisement
Advertisement